అభిమానుల్లాగే నేనూ వెయిటింగ్.. అకీరా నందన్ సినీ ఎంట్రీపై అడివి శేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • తమ ఇద్దరి మధ్య 'లెఫ్ట్ హ్యాండ్' కనెక్షన్ ఉందని ఆసక్తికర విషయం పంచుకున్న శేష్
  • అకీరా ఆలోచనా విధానం ఎంతో పరిణతితో ఉంటుందని ప్రశంస
  • నటుడిగా వస్తాడా, సంగీత దర్శకుడు అవుతాడా అనే అంశంపై కొనసాగుతున్న ఉత్కంఠ 
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ సినీ అరంగేట్రం ఎప్పుడు జరుగుతుందా అని మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో యువ హీరో అడివి శేష్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. తన తాజా చిత్రం 'డెకాయిట్' హిట్ అయిన సందర్భంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో అకీరాతో అడివి శేష్.. అకీరాతో తనకున్న అనుబంధం, ఆయన సినీ భవిష్యత్తు గురించి మాట్లాడారు.

గత కొంతకాలంగా అకీరా సినీ ఎంట్రీ కోసం అడివి శేష్ ఒక ప్రత్యేకమైన కథను సిద్ధం చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై శేష్ స్పందిస్తూ.. "అకీరాకు ఇప్పటికే విపరీతమైన అభిమానగణం ఉంది. ఆయన ఎంట్రీ కోసం లక్షలాది మంది అభిమానుల లాగే నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని తెలిపారు. అకీరా ఎప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చినా అది ఒక పెద్ద సంచలనం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

అకీరాతో తనకున్న వ్యక్తిగత బంధం గురించి శేష్ వివరిస్తూ.. "అకీరా నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. మేమిద్దరం అప్పుడప్పుడు కలుస్తుంటాం. మా ఇద్దరి మధ్య ఒక కామన్ పాయింట్ ఉంది. మేమిద్దరం 'లెఫ్ట్ హ్యాండర్స్' (ఎడమచేతి వాటం ఉన్నవారు). ఆ విషయంలో మా మధ్య మంచి సింక్ కుదిరింది" అని నవ్వుతూ చెప్పారు. అకీరా ఆలోచనా విధానం, ఆయన పరిణతి తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని శేష్ ప్రశంసించారు.

నటుడిగా వస్తాడా? సంగీత దర్శకుడవుతాడా? 
అకీరా నందన్ ప్రస్తుతం విదేశాలలో సంగీతంలో శిక్షణ పొందుతున్నట్లు సమాచారం. గతంలో ఆయన తల్లి రేణు దేశాయ్ కూడా తన కుమారుడికి సంగీతంపైనే మక్కువ ఎక్కువని, కెరీర్ ఎంపిక పూర్తిగా అతనికే వదిలేశామని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ సైతం తన పిల్లల ఇష్టాలకే ప్రాధాన్యత ఇస్తారని తెలిసిందే. ఈ నేపథ్యంలో అకీరా కథానాయకుడిగా అడుగుపెడతాడా? లేక సంగీత దర్శకుడిగా? తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా అడివి శేష్ వ్యాఖ్యలతో అకీరా ఎంట్రీపై మరోసారి జోరుగా చర్చ మొదలైంది.

Akira Nandan
Adivi Sesh
Pawan Kalyan
Renu Desai
Decoyit Movie
Telugu Cinema
Tollywood
Akira Nandan Debut
Left Handers
Music Training

More Telugu News